Home /   Categories /   Fiction  /   Revu, G.S. Chalam
  • Revu, G.S. Chalam
  • Revu, G.S. Chalam

Revu, G.S. Chalam

Per piece

Product details

 

రకరకాలుగా మాసిన బట్టల్ని మందునీళ్ళల్లో ముంచి నానబెట్టి, వుబకబానల్లోవేసి వుడకబెట్టి, బండలపైన బాది , మురికి వదిలాక నీళ్ళల్లో శుభ్రంచేసి యెండలో ఆరబెట్టే చోటును రేవు అని పిలస్తారు. అందుకే బ్రష్టుపట్టిపోయి కుళ్ళుకంపుగొట్టే మనుషుల్ని వుతికి ఆరేసి శుభ్రం చేసే పనిని రేవుపెట్టడం అని చాలాచోట్ల అంటారు. వర్ణాశ్రమధర్మాలపేరుతో కొన్ని కులాలవాళ్ళను శాశ్వత బందీలుగామార్చి చిత్రహింసలకు గురిచేసే వొకానొక గ్రామీణ ప్రాంతపు దుర్మార్గాల్ని రేవుకు పెట్టే నవల యిది. 

వాస్తవికతను దాటకుండా, ప్రాంతీయతను వదిలిపెట్టకుండా, సాధికారంగా మాండలికాన్ని వాడుతూనే సమకాలీన సమాజానికంతా ప్రతీకగా మారడం యీ నవల ప్రత్యేకత. సమాజపు చీకటి మూలల్లో కనబడకుండా వుండిపోయిన శ్రామిక జనుల జీవన యాతనలను, నిర్దుష్టంగా చిత్రించిన యీ నవల అధో జగత్తు సోదరుల జీవితాలపైన వచ్చిన నవలలకొక కొత్త చేర్పు.

 —--మధురాంతకం నరేంద్ర

 

నాగావళి, వంశధార నదుల నడుమ ఒక కళింగాంధ్ర పల్లె. అందులో ఒక చాకలిపేట. ఆ పేటలో నిద్ర లేచీ  లేవగానే మాసిన బట్టలు తెచ్చేందుకు రైతుల ఇళ్ళకీ, వాటి మురికిని వదిలించడానికి చాకిరేవుకీ పరుగులు తీసే అనేకమంది అంకమ్మలు, ఆదిసెట్టిలు. అంతేనా...రేవు చాకిరీకి తోడు శుభాలకు, చావులకు కూడా చేయాల్సిన వెట్టిచాకిరీ. పెళ్ళిళ్ళకు పల్లకీలు, గర్భాలకు కావుళ్ళు మోసుకెళ్ళడమే కాదు, చస్తే పూడ్చి పెట్టడానికి గోతులు తవ్వడమే కాదు, శవం పూర్తిగా కాలేదాకా కాపలా కాసే పని కూడా వాళ్ళదే. అందుకే 'సాకలోడుగా మాత్రం అస్సలు పుట్టకూడదు. దీని కన్నా నీచమైన బతుకు మరొకట్నేదు చీ' అనుకుంటాడు నారిసెట్టి. ఇంకొక అడుగు ముందుకేసి ఈ బతుకు వద్దే వద్దు అని ఊరొదిలి విశాఖపట్నానికి వెళ్ళిపోతాడు అంకమ్మ తమ్ముడు రామిసెట్టి.

పల్లె నుండే కాదు వృత్తి నుండి కూడా 50 ఏళ్ళ క్రితం మొదలైన ఈ వలస ఎప్పుడోసారి పూర్తి కాక తప్పదు. ఇవ్వాళ ఒక వాషింగ్ మెషీన్ తో లేదా రెండు చేతులతో ఎవరింట్లో వాళ్ళు చేసుకోగల పని కోసం ఇంతమందిని ఇంత కాలం ఇంత క్షోభ పెట్టామే...అనుకోకుండా ఉండలేకపోయాను. చాకలివారి జీవితం మీద తెలుగులో వచ్చిన తొలి నవల బహుశా ఇదేనేమో. తనది కాని జీవితాన్ని కూడా ఎంతో లోతుగా పరిశీలించి మరెంతో ఆర్తిగా రాసిన జి.ఎస్.చలంకు  ప్రత్యేక అభినందనలు.

   ---   వేమన వసంతలక్ష్మి


Similar products