Bibhutibhushan Bandopadhyay Combo offer,Bibhutibhushan Bandopadhyay

500.00670.00 (-25%)

91 in stock

Price,670/-

Bibhutibhushan Bandopadhyay

Category:

Description

Among the works of Bibhutibhushan Bandopadhyaya Pather Panchali and Aparajitudu can be described as biographic novels where as Chandragiri Sikharam is children literature. In Vanavasi, the writer presents a part of his own story through the character of Satyacharan. In contrast, in Doorantaram the story revolves around a Zamindari family in the background of sweeping social changes. all these five books put together on offer for limited period of two weeks from 1st february 2021

Bibhutibhushan Bandopadhyay (1894-1950) worked as a teacher and is considered the best modern important Indian novelist.

Telugu

Telugu

బిభూతి భూషణ్ నవలలు అయిదు
చదవడంలో ఉన్న హాయి ఎందులోనూ లేదు. అలాగని చదివిందీ, చదువుతున్నదీ పెద్దగా ఏమీలేదు. ఏవో రాయాలనుకోవడం, ఆ రాతకు సంబంధించినవే చదవడం! అదీ గొప్పగా ఏమీ జరగదు. ప్రతిసారీ చదవడంలో ఉన్న హాయిని అనుభవిస్తున్నా అంతలోనే ఆ హాయి గురించిన జ్ఞానాన్ని మరచిపోయి పక్కదారులు పట్టడమే.
చదవడానికి, రాయడానికి తేడా ఏమిటసలు? చదవడం స్వాత్మానందమైతే రాయడం ఆ ఆనందాన్ని ఇంకొకరితో పంచుకోవడం. చదవడం అనేది ఇంకొకరు వండి సిద్ధం చేసిన షడ్రసోపేతమైన విందును ఆరగించడం; రాయడం మన వంట మనమే చేసుకుని తిని ఆనందించడం.
చదవడం అంటే పుస్తకాలు చదవడమేనా? కాదు, జీవితాన్ని, లోకాన్ని చదవడం కూడా! మళ్ళీ వ్యక్తిగతానికి వస్తే, ఒక గొప్ప రచన చదివిన ప్రతిసారీ ఇంకో రచన చదవడానికి సమయం తీసుకుంటుంది. ఆ సమయం ఒక్కోసారి సుదీర్ఘం కావచ్చు. అందుకు మానసికంగా సిద్ధం కావాలి. ముందు చదివిన గొప్పరచన కలిగించిన పఠనానుభూతిని, ఆ స్థాయిలో ఈ రచన కలిగిస్తుందో లేదో; ఆ శిఖరం నుంచి కూలి ఎక్కడ కింద పడిపోతామో, ఆ అనుభూతి ఎక్కడ పలచనైపోతుందోనన్న, స్వార్థంతో కూడిన భయం. కొత్త పుస్తకం చేతిలోకి తీసుకునే ప్రతిసారీ ఇలాంటి సంకోచమే, ఇలాంటి పెనుగులాటే. కృత్యాద్యవస్థలానే ఇదొక పఠనాద్యవస్థ.
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన అయిదు నవలలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ మధ్య ప్రచురించింది. అవి: దూరాంతరం(దండమూడి మహీధర్ అనువాదం), చంద్రగిరిశిఖరం(కాత్యాయని అనువాదం), వనవాసి(సూరంపూడి సీతారాం అనువాదం), పథేర్ పాంచాలి(మద్దిపట్ల సూరి అనువాదం), అపరాజితుడు(కాత్యాయని అనువాదం). ఫిబ్రవరిలో ఈ పుస్తకాలు తెప్పించుకుని, మార్చి 26న చదవడం ప్రారంభించి పైన చెప్పిన వరసలోనే నిన్న(సెప్టెంబర్ 2)పూర్తిచేశాను.
ఈయన మామూలు రచయిత కాదు. తన అక్షరాల స్వచ్ఛజలాలతో మన హృదయాలను అంటి ఉన్నమాలిన్యాలను కడిగేస్తాడు; చదివినంతసేపైనా! ఇతడు ప్రకృతికవి, కవిత్వాన్నే వచనంగా మార్చి గొప్పగా నవలీకరిస్తాడు. ఇతడు స్త్రీలను చాలా ఉదాత్తంగా, అద్భుతంగా, అందంగా చిత్రిస్తాడు. వాళ్ళ కాళ్ళకు మొక్కాలనిపిస్తుంది. వాళ్ళ ఉనికి వల్లనే ఈ లోకం ఎంతో సౌందర్యవంతంగానూ, వాసయోగ్యంగానూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక స్ఫూర్తి, ఒక ఆశాభావం, స్నేహం, సౌజన్యం వాళ్లనుంచి మనలోకి ప్రవహిస్తూ ఉంటాయి.
1894లో పుట్టిన ఇతని బాల్యమంతా పేదరికంలోనే గడిచిందట. కానీ ప్రకృతి ఆస్వాదనలో, కుసుమకోమల భావాలలో పేద కాదు; వాటిని మనకు పంచి ఇవ్వడంలో గొప్ప ధనికుడు. 1950లో కన్ను మూసిన ఈ బెంగాలీ రచయిత తన కాలపు కటిక పేదరికాన్ని చాలా సహజంగా చిత్రించాడు; కానీ నేటి మన కళ్ళకు పరమనగ్నంగా పరమ భీభత్సకరంగా కనిపిస్తుంది. ఈ నేల మీద ఇంతటి పేదరికం ఉండేదా, అది సాధ్యమా అనిపిస్తుంది. ఇతని రచనలు పేదరికం చరిత్రను చెబుతాయి. మన తెలుగులో ఈ కాలాన్ని చిత్రించిన నవలలు లేవన్న సంగతి ఈయనను చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. పేదరికానికి ఇతడు భయపడలేదు. దాని ఉక్కు పిడికిలినుంచి తప్పించుకుని తనకు ఇష్టమైన, మానవసంబంధాలు మిళితమైన ప్రాకృతికజీవితాన్ని గెలుచుకోడానికే ప్రయత్నించాడు. అదే తన కొడుక్కి ఆస్తిగా ఇవ్వదలిచాడు. ‘పథేర్ పాంచాలి’, దాని సీక్వెల్ అయిన ‘అపరాజితుడు’లో ఇతివృత్తం ఇదే.
ఇతనికి చరిత్ర ఇష్టం. ఆ కోణం ఇతని నవలల్లో పరచుకుని ఉంటుంది. ఇతని ‘వనవాసి’ నవల అంతా విస్తారమైన అడవుల్ని నరికేసి పొలాలుగా మార్చేసి జనావాసాలను ఏర్పాటు చేయడం గురించే. మహాభారతంలోని అర్జునుడి ద్వారా, ఇంకా అతని కంటె చాలా ముందునుంచీ, మధ్యలో అశోకునిగా మీదుగా ఇప్పటివరకూ ఈ దేశంలో జరుగుతూవచ్చింది అడవుల నరికివేతే. ఇదే చరిత్రపూర్వయుగంనుంచీ ఈ దేశంలో ప్రధానపరిశ్రమ.
అడుగడుగునా కంటతడి పెట్టించే ఇతను చాలా కఠినుడు కూడా. మన మనసులకు ఎంతో దగ్గరగా వచ్చిన పసిమొగ్గలను, ఇప్పుడిప్పుడే జీవితంలోకి అరవిరిసిన అందమైన యువజీవులను, నడివయసు మనుషులను చూస్తూ చూస్తూ ఉండగానే అదాటుగా అకాలంగా అన్యాయంగా చంపేస్తాడు. ‘పథేర్ పాంచాలి’లో చిన్నారి దుర్గను అలాగే చంపేశాడు. ఆ తర్వాత నాకు చదవాలనిపించక పుస్తకం మూసేశాను; ఒక రోజు విరామం తర్వాతే యాంత్రికంగా పుస్తకం తీసుకుని పూర్తిచేశాను. తండ్రి హరిహరరాయ్ ని, ‘అపరాజితుడు’లో తల్లి సర్వజయను, చివరికి రెండేళ్ళు కూడా కాపురం చేయని అర్ధాంగి అపర్ణను, స్నేహితురాలు లీలను చంపేశాడు. ఒక రోడ్డు ప్రమాద ఘట్టంలో కొడుకు కాజల్ ను కూడా చంపేయబోతున్నాడా అనిపిస్తుంది, కానీ చంపడు; హమ్మయ్య అనుకుంటాం. ఇంకో కోణం లోంచి చూస్తే, చంపడం ఆయన తప్పు కూడా కాదు. అప్పట్లో దేశంలో వైద్యసదుపాయాలు లేవు; దాంతో చిన్న జ్వరం కూడా ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉండేది. పోషకాహారం లేక రోగనిరోధకశక్తి లోపించడం దానికి తోడయ్యేది.
అనువాదాలు చాలా బాగున్నాయి; కాత్యాయని గారి అనువాదం చదువుతున్నంతసేపూ ఒకటే సందేహం-బెంగాలీనుంచి చేశారా, లేక హిందీనుంచో, ఇంగ్లీష్ నుంచో చేశారా అని! కాత్యాయనిగారిని అడిగితే ఇంగ్లీష్ నుంచే చేశానని అన్నారు. కానీ మూలం నుంచే చేసిన అనువాదంలా అనిపించింది తప్ప ఇంగ్లీష్ నుంచి చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. చివరికి వస్తున్నకొద్దీ అక్షరక్షరంలో భావుకత్వం నిండిన మూల రచయిత కవితాత్మకశైలితో కాత్యాయనిగారి అనువాదం పోటీపడుతూ సాగింది.
ఎంతైనా రాయొచ్చు. ఈ చిన్న పోస్ట్ ఈ మహారచయితకు న్యాయం చేయదని తెలుసు. అయినా ఉండబట్టలేక…
-కల్లూరి భాస్కరం

Reviews (0)

Be the first to review “Bibhutibhushan Bandopadhyay Combo offer,Bibhutibhushan Bandopadhyay”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.